చేబ్రోలు మండలంలోని వేజెండ్ల లో డాక్టర్ పెమ్మసాని, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి మంగళవారం పర్యటించారు. అందులో భాగంగా ఆయన వేజెండ్ల లోని పలు ప్రాంతాలలో పర్యటిస్తూ స్థానికులను కలుసుకొని మాట్లాడారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్, ప్రజల 45 ఏళ్ల భవితవ్యాన్ని నాశనం చేశారన్నారు. ఇక మళ్ళీ రానేమో అన్న భయంతోనే స్థానిక ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ తో చెలరేగిపోతున్నారని తెలిపారు. అదే దోపిడీలో జగన్ కు వాటాలు లేవంటే నమ్మగలమా? అని ఆయన నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే ఒక్క ఛాన్స్ ఇస్తేనే 700 ఎకరాలు మింగేశారని, ఇక పార్లమెంట్ కు వెళ్తే ఇంకేం చేస్తారోనన్నారు. తాను చట్ట సభలోకి అడుగు పెట్టిన మారు క్షణం నుంచి ప్రజలకు భరోసాగా ఉంటానని, ముస్లింల మనోభావాలకు, స్వేచ్ఛకు విఘాతం కలగకుండా చూసుకుంటానని స్పష్టం చేశారు. అలాగే ధూళిపాళ్ల మాట్లాడుతూ ముస్లింలకు నిజమైన న్యాయం చేసింది టీడీపీ అని తెలిపారు. రంజాన్ తోఫా, మసీదుల మరమ్మతులు, విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఈ జగన్ ప్రభుత్వంలో ముస్లింల కోసం ఒక్క రూపాయి అయినా ఖర్చు చేసారా? అని ప్రశ్నించారు. ఈ పర్యటనలో మండల ప్రెసిడెంట్ మైలా వెంకటరామారాజు తదితరులు పాల్గొన్నారు.