మంగళగిరి పర్యటనలో వైసీపీ ప్రభుత్వంపై డా. పెమ్మసాని ఫైర్ ‘వైసీపీ అధినేత మాదిరిగానే ఆ పార్టీ నాయకులూ అరాచకాలు సృష్టిస్తున్నారు. అర్చకులను, ముస్లిం మహిళలు, చేనేత కుటుంబాలను వేధింపులు, హింసలకు గురి చేస్తున్నారు. భౌతిక దాడులు మొదలు ప్రాణాలు తీసేవరకు తెగిస్తున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. మంగళగిరిలోని స్థానిక షరాఫ్ బజార్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి స్వర్ణకారులు, వర్తక, వ్యాపారులను కలిసి మాట్లాడారు. వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో పెమ్మసాని మాట్లాడుతూ పర్యటనలో భాగంగా పలువురు వర్తక వ్యాపారులను, స్వర్ణకారులను కలుసుకున్న నేపథ్యంలో లోకేష్ గారు అఖండ మెజారిటీతో గెలవబోతున్నారని అర్థమైందని తెలిపారు. లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్న ప్రజలకు, వ్యాపారులకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు.  పర్యటనలో మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్ధయ్య, టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ దామర్ల రాజు, జనసేన మంగళగిరి జనసేన అధ్యక్షులు షేక్ కైరుల్లా, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిసెట్టి జానకీ దేవి తదితరులు పాల్గొన్నారు.