జగన్ ప్రజా కక్షపాతి. * టిడ్కో ఇళ్లు నాశనం చేయించిన జగన్ ప్రభుత్వంపై డా. పెమ్మసాని ఆగ్రహం. ‘గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్న టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా ఆపేసిన జగన్ ప్రజాపక్షపాతి కాదు కక్షపాతి. ఈ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు.’ అని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. తెనాలిలోని పూలే కాలనీలో శిథిలావస్థకు చేరిన టిడ్కో ఇళ్లను నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని గురువారం పరిశీలించారు. పరిశీలన అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస యోజన-ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు గూడు కల్పించాలనే సంకల్పంతో టిడ్కో ఇళ్లను నిర్మింప చేశారన్నారు. కేవలం చంద్రబాబుకు పేరు వస్తుందనే కక్షతోనే టిడ్కో ఇళ్లను ప్రజలకు ఈ ప్రభుత్వం కేటాయించలేదని ఆయన చెప్పారు. అప్పులు తెచ్చుకొని మరి లబ్ధిదారులు వాటా చెల్లించిన ప్రజలకు ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ఆయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం చెల్లిస్తానన్న లబ్ధిదారుని వాటా రాయితీ అందకపోగా, రుణాలకు వడ్డీలు చెల్లించలేక ప్రజల అవస్థలు పడుతూ, అద్దెలలో మగ్గిపోతున్నారు అని తెలిపారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విధ్వంసంతో మొదలైన జగన్ ప్రభుత్వం అరాచకాలు నేటికీ కొనసాగుతున్నాయి అన్నారు. ప్రజా వేదిక, అమరావతి, టిడ్కో ఇళ్లు ఇలా వరుసగా కూల్చడం నష్టం కలిగించడమే ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతుందని తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులే ఈ టిడ్కో ఇళ్లల్లో చువ్వలు, గుమ్మాలు పీక్కుని వెళ్లి అమ్ముకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయని మనోహర్ విమర్శించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి నాయకులు పాల్గొన్నారు.