తెనాలిలోని గ్రాండ్ గౌతమ్ హోటల్లో గురువారం రాత్రి జరిగిన డాక్టర్స్ మీట్ కార్యక్రమానికి నాదెండ్ల మనోహర్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు సమస్యలు, వేధింపుల వికృత రాజకీయాల మధ్యన ఏపీలో పనిచేస్తున్న వైద్యులు నిజంగా గొప్పవారని తెలిపారు. రాజకీయ, రాజకీయేతర ఎలాంటి సమస్యలు ఉన్నాసరే వైద్యులకు తాను ఎల్లపుడూ అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. టిడిపిని డిస్టర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి, టిడిపి సత్తా ఏంటో చూపించాలని తాము రాజకీయాల్లోకి వచ్చామన్నారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తెనాలి అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ముందుంటానన్నారు. నలుగురిని బెదిరిస్తే, వేధిస్తేనో చాలు, పాలన చేయవచ్చని వైసిపి భ్రమ పడుతుందని చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో గంజాయి సంస్కృతి మితిమీరి పోయిందని, వల్లభాపురం, కొల్లిపర వంటి పచ్చని ప్రాంతాల్లోనూ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన క్రమంలో ఆయనను, ఆయన కుటుంబాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ప్రభుత్వం ఎన్నో వేధింపులకు గురి చేసిందని, పవన్ ను సైతం అనేక సందర్భాల్లో వేదించిన ఘటనలు ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇలాంటి అరాచక పరిస్థితుల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పడిందన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్ఫూర్తిగా పోరాడే వైద్యులకు మనోహర్ తన ధన్యవాదాలు తెలిపారు.