పత్తిపాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులుపై బుధవారం జరిగిన వైసీపీ నాయకుల దాడిని ఖండిస్తూ డాక్టర్ పెమ్మసానితో పాటు పలువురు టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు ఎస్పీ తుషార్ డూడీని ఆయన కార్యాలయంలో గురువారం కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసి సమస్యను వివరించిన తర్వాత ఎన్నికల నియమావళిని సంపూర్ణంగా అమలు చేయాలని కోరారు. అనంతరం విలేకరులతో పెమ్మసాని మాట్లాడుతూ ఎస్పీ, కలెక్టర్ కలిసి ఎన్నికల నిబంధనలపై స్పష్టమైన వైఖరిని అవలంబించాలని కోరారు. అధికార పార్టీ నాయకులు ఇదే తీరున దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని, తమదైన పద్ధతిలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని వైసిపి నాయకులను ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, తాడికొండ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.