ప్రత్తిపాడులోని వివాహ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన నియోజకవర్గ టిడిపి-జనసేన నాయకుల ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.రాబోయే 30 ఏళ్లు జిల్లాలోనే ఉంటూ, గుంటూరు పార్లమెంటు పరిధిని అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం రైతు సమస్యలపై స్పందిస్తూ, నేటి పరిస్థితుల్లో రైతుకు ఎక్కడ చూసినా అవాంతరాలు ఎదురవుతున్నాయని, కల్తీ ఎరువులు, విత్తనాలు వంటి సమస్యలపై రైతులకు న్యాయం చేస్తానని పెమ్మసాని చెప్పారు. అలాగే నియోజకవర్గంలో ప్రధానమైన నాలుగు సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం పరిచయ కార్యక్రమానికి సభా అధ్యక్షత వహించిన బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ భారతదేశ ప్రతిష్టను విదేశాల్లో చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ పెమ్మసాని అని ప్రశంసించారు. పెమ్మసాని అనే పేరు ఒక ప్రభంజనం అని, అలాంటి వ్యక్తి పార్లమెంటులో అడుగుపెడితే ప్రజానేతగా ఎదగడం ఖాయమని తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్ రావు, టిడిపి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు, గుంటూరు ఈస్ట్ జనసేన ఇంచార్జ్ నేరెళ్ల సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.