గుంటూరు జిల్లా టిడిపి కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా తెలుగు యువత ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా గెలిచి సైరన్ సౌండ్ వచ్చే వాహనాల్లో ప్రయాణించడానికి రాలేదని, తన వంతు సాయంగా యువతకు, ఇతరులకు తోడ్పాటును అందించేందుకు వచ్చామని చెప్పారు. యువత నిరుత్సాహపడకుండా సాంకేతికతతో పోటీపడుతూ ముందుకు సాగాలన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తాను కలిసి రాబోయే పదేళ్లకు ఉపయోగపడేలా ప్రజలకు, యువతకు ఉపయోగపడేలా పలు ప్రణాళికలు రచిస్తున్నామని, యువత సహకరిస్తే మరెన్నో అద్భుతాలు సృష్టించగలమని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలో మూడు యూనివర్సిటీలు తెచ్చిన ఘనత చంద్రబాబు గారిదే అని అన్నారు. అయితే మరో 40 యూనివర్సిటీలు రాజధానికి రావడానికి సిద్ధంగా ఉండగా, జగన్ రద్దు చేయడంతో ఆగిపోయిన విషయం చాలామందికి తెలియదని వివరించారు. అలాగే జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రాయపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ఎంతోమంది యువతను ఇబ్బందులు పెట్టారని, అయినా తెలుగు యువత ఎక్కడా వెనకడుగు వేయలేదని తెలిపారు. కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు పశ్చిమ టిడిపి నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు(నాని), తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.