నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన స్థానిక వైద్యుల ఆత్మీయ కలయిక కార్యక్రమానికి గురువారం సాయంత్రం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ తన కంటే ఇక్కడున్న డాక్టర్లు ఎంతో గొప్పవారని, తాను 20 ఏళ్లలో అమెరికాలో ఉన్నా తనను ఏ ఒక్కడూ లంచం అడగలేదని, కానీ ఎన్నో ఒత్తిళ్ళ మధ్య, అవినీతి మధ్య నలిగిపోతున్న ఇక్కడి డాక్టర్లు ఆ ఒత్తిళ్లను అధిగమించి మరీ వైద్యం చేస్తుండడం నిజంగా అభినందనీయమని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.  ఈ వేదిక సాక్షిగా వైద్యులు తమ సమస్యలను బయట పెట్టారని, తనకు తెలిపిన సమస్యలు మాత్రమే కాకుండా రాబోయే సమస్యలపై కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నానని పెమ్మసాని చెప్పారు.ఓటర్లు ఇచ్చే తీర్పును బట్టే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, తమకు సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రులు పరిశ్రమలు తీసుకొస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా కొందరు వైద్యులు మాట్లాడుతూ రోజుకు ఐదు గంటలు కూడా పనిచేయని ఎమ్మెల్యేలు, మహిళలకు అక్రమ సంబంధాలు అంటగట్టే ప్రజాప్రతినిధుల మధ్య నివసిస్తున్న తమలాంటి ప్రజల మధ్యకు ఒక డాక్టర్ పోరాడడానికి వచ్చారన్నారు.   వైద్యులపై జరుగుతున్న దాడులు, ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర స్థాయిలో డా. పెమ్మసాని ద్వారా చర్చలు జరగాలని ఈ సందర్భంగా వైద్యులు కోరారు. ఈ కార్యక్రమంలో గుంటూరుకు చెందిన పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.