ప్రజా గళం విజయవంతం చేద్దాం. టిడిపి కార్యకర్తలతో డాక్టర్ పెమ్మసాని ‘కార్యకర్తల్లో కనిపిస్తున్న ఉత్సాహం సఫలీకృతమయ్యే సమయం ఆసన్నం అయింది. నేడు జరగబోయే చంద్రబాబు గారి ప్రజా గళం యాత్ర, భారీ బహిరంగ సభను సమిష్టిగా నడిపించి విజయవంతం చేద్దాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. టిడిపి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పెమ్మసాని మాట్లాడుతూ ప్రజా గళం యాత్ర నిర్వహణకు అబ్జర్వర్ గా విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారికి ఆహ్వానం పలికారు. నాలుగున్నరేళ్ళుగా కార్యకర్తలు, నాయకులు పడుతున్న అవమానాలకు, వేధింపులకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. మరో 10 రోజులు అందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేస్తే ఈ అరాచక పాలనకు వీడ్కోలు పలకడం కష్టమేమీ కాదన్నారు. పార్టీలో నిజంగా కష్టపడ్డ కార్యకర్తలకు టిడిపి అండగా ఉంటుందని, ఎవరు కష్టపడుతున్నారో, ఎవరు దూరంగా ఉంటున్నారో తెలుసుకోవడం కష్టమైన పని ఏమి కాదని చెప్పారు. అలాగే హాజీ షేక్ షౌకత్ గురించి మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా టిడిపి పార్టీలో చేరబోతున్నారని పెమ్మసాని తెలిపారు. నేడు బాబు గారు పాల్గొనబోయే ప్రజాగళం భారీ బహిరంగ సభలో ఆయన బాబు గారి చేతుల మీదుగా టీడీపీ కండువా కప్పుకుంటారని వివరించారు. అలాగే దేవినేని ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ నేడు జరగబోయే ప్రజా గళం యాత్రకు టిడిపి, బిజెపి, జనసేన నాయకులు విరివిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రచార కార్యక్రమాల నుంచే ప్రజల్లో అత్యంత ప్రాముఖ్యతను సంపాదించుకున్న నాయకులు పెమ్మసాని అని తెలిపారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రాజధాని ప్రాంతానికి పార్లమెంట్ అభ్యర్థిగా రావడం సాధారణ విషయం కాదని, అలాంటి వ్యక్తిని బాబు గారు ఏరి కోరి ఎన్నిక చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తుని చిట్టిబాబు, టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్, కార్పొరేటర్ పోతురాజు సమత తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories