ప్రజల అంచనాలకు మించి మా అభివృద్ధి. * వ్యాపారవేత్త చాపరాల సూర్య ప్రకాష్ పుట్టినరోజు వేడుకల్లో డాక్టర్ పెమ్మసాని. ‘జగన్ ప్రభుత్వం వైఫల్యం తర్వాత ప్రజలు టిడిపి వైపు ఆశగా చూస్తున్నారు. ప్రజల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అభివృద్ధి చేసి చూపిస్తాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త చాపరాల సూర్య ప్రకాష్ గారి 84వ పుట్టినరోజు వేడుకలు స్థానిక మాజేటి రామ్ కళ్యాణ మండపం లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పెమ్మసాని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో తన పాత మిత్రులను ఉపాధ్యాయులను కలుసుకోగలిగానని అన్నారు. రాజకీయాలు మాట్లాడాల్సిన వేదిక కాకపోయినా ఏదో ఒక సందర్భంలో ప్రజా సమస్యలు తమ కంట పడుతున్నాయని ఆయన తెలిపారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోపే తమ అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ ప్రజలు సరైన సమయంలో సరైన నాయకున్ని ఎంచుకున్న నాడే అసలైన ప్రజాస్వామ్యం నిలబడుతుందని తెలిపారు. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకున్న జగన్ ప్రభుత్వం అరాచక పాలనకు తెరతీసిందని, అడుగడుగునా నలిగిపోయిన ప్రజానీకం జగన్ ప్రభుత్వానికి తిలోదకాలు వదలడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ వేడుకల్లో ప్రముఖ ఎనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు, డాక్టర్ రామశేషయ్య, బిజెపి నాయకులు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.