*రత్నాల పేరిట రాళ్లు పెట్టారు. * తెనాలి డివిజన్ నాయకుల ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని. ‘ఎన్నికలకు ముందు రత్నాలు పేరు చెప్పి రాళ్లు పెట్టిన ఘనత ఈ వైసీపీకే చెల్లుతుంది, తెనాలి నియోజకవర్గ, గుంటూరు జిల్లా పరిధుల్లో వైసీపీ వాసనే ఉండకూడదు.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలోని స్థానిక ఎన్వీఆర్ కళ్యాణమండపంలో గురువారం జరిగిన డివిజన్ నాయకుల ఆత్మీయ కలయిక కార్యక్రమంలో డా. పెమ్మసాని, కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల కష్టాన్ని తాను స్వయంగా గుర్తిస్తానని, కష్టపడ్డ వారెవరు? తప్పు చేసింది ఎవరు అనేది తెలుసుకోవడం తనకు కష్టమేమీ కాదని తెలిపారు. జనసేనలో రెండో స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ కు అవకాశమిస్తే నియోజకవర్గానికి మంచి జరుగుతుందని తెలిపారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ పాలన మొదటి రోజు నుంచే ఈ ప్రభుత్వం విధ్వంసంతో మొదలు పెట్టిందని అన్నారు. తొలుత దామోదర సంజీవయ్య మొదలుపెట్టిన పించన్ విధానాన్ని, అన్న ఎన్టీయార్ ఉధృతంగా ముందుకు తీసుకెళ్లారన్నారు. కానీ ఈ జగన్ మాత్రం బటన్ నొక్కడమే అభివృద్ధి అనుకుంటున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ముందుగా డివిజన్ నాయకులను పెమ్మసాని, మనోహర్ కు వార్డుల వారీగా పరిచయం చేశారు.