టిడిపి – జనసేన పార్టీల ఆధ్వర్యంలో గురువారం తెనాలిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పెమ్మసాని తో పాటు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుంచి కాలినడకన మొదలైన ఈ ప్రచారం పాత స్వరాజ్య థియేటర్ మీదుగా బోస్ రోడ్, గాంధీ చౌక్, షరాఫ్ బజార్ గుండా మున్సిపల్ కాంప్లెక్స్ వరకు సాగింది. ప్రచారం జరుగుతున్న ప్రతిచోట వ్యాపారులు, యువత, మహిళలు, వృద్ధులు ఇరు పార్టీల నాయకులకు స్వాగతం పలికారు. నవయుగ హోటల్ సెంటర్ వద్దకు చేరేసరికి టిడిపి – జనసేన శ్రేణులు ఎక్స్ కవేరేటర్ సహాయంతో భారీ గజమాలను డాక్టర్ పెమ్మసాని, నాదెండ్లకు మెడలో వేసి గౌరవించారు. కాగా మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత నాయకులు తమ ప్రచారాన్ని ముగించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అ నుంచి అం, అ: వరకు జగన్ తప్పులు చేసుకుంటూ వెళ్లారని చెప్పారు. ‘అ అంటే అంగన్వాడీలకు అన్యాయం, ఆ అంటే ఆరోగ్యశ్రీ కి ద్రోహం, ఇ అంటే ఇసుక దోపిడీ, ఉ అంటే ఉద్యోగాలు లేకపోవడం’ వంటి ఎన్నో లెక్కలేనన్ని పాపాలు చేశారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో నగర, నియోజకవర్గ కార్యకర్తలు ఇరు పార్టీల శ్రేణులతో పాటు ప్రజలు కూడా కలిసి నడిచారు.