అవినీతి సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ కు తరలింపు. + ఐదేళ్లు జనం మొహం చూడకుండా పాలించిన సీఎం జగన్. + అత్తోట గ్రామ పర్యటనలో పెమ్మసాని. గుంటూరు: ‘ఇసుక అక్రమ తవ్వకాలతో సహజ వనరులు దెబ్బతినడమే కాక, పంట భూములు కూడా నాశనం అవుతాయి. ఇసుక తవ్వకాల్లో వచ్చిన అవినీతి సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ కు చేరుతున్నాయి. ప్రజలకు మొహం చూపించుకోలేని సీఎం ఐదేళ్లుగా బయటకు రాకుండా పాలన చేస్తున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. తెనాలి నియోజకవర్గంలోని నందివెలుగు, అత్తోట గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నాదెండ్ల మనోహర్ తో కలిసి పెమ్మసాని గురువారం నిర్వహించారు. దారి పొడవునా ప్రజలంతా పూలవర్షంతో ఇరువురు నాయకులకు స్వాగతం పలుకగా, పలుచోట్ల భారీ గజమాలతో, హారతులు పడుతూ నాయకులను కార్యకర్తలు గౌరవించారు. ప్రజలను కలుస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూనే నాయకులు ఇద్దరు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా ప్రచారం ముగింపు సభలో భాగంగా అత్తోటలో పెమ్మసాని మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 500 రీచ్ లను అక్రమంగా తవ్వినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలియజేసిందని చెప్పారు. ఇసుక తవ్వితే సహజ వనరుల అక్రమ రవాణా మాత్రమే గాక భూమిలోకి ఉప్పునీరు పూర్తిగా ఇంకిపోయి, పంట భూములను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని తెలిపారు. అలాగే పవన్ అంటే ఆయనకు వ్యక్తిగత అభిమానం ఉందని, బిజెపితో పొత్తు పవన్ చొరవేనని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. పవన్ లాంటి నీతి నిజాయితీ గల వ్యక్తికి ఆవేశం కాకుండా, వైసీపీ నాయకుల్లా నక్కజిత్తులు ఉండాలా? అని ఓ ప్రశ్నకు సమాధానంగా పెమ్మసాని సమాధానం ఇచ్చారు. వేసవిలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి వంటి సమస్యలను పరిష్కరించాల్సిన ఒక సీఎం దగ్గరుండి అవినీతిని ప్రోత్సహిస్తుంటే ప్రజాభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఒక పెమ్మసాని, పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులు ఎప్పుడూ ముందుంటారని ఆయన తెలిపారు. స్వలాభం కోసమే వైసీపీలో పదవులు. వైసీపీ నాయకులు కేవలం స్వలాభం కోసమే పదవులను ఉపయోగించుకుంటున్నారని తెనాలి నియోజకవర్గం అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే యాదవపాలెంలో రోడ్లు ఎందుకు వేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డను అని చెప్పుకొని గెలిచిన జగన్ ఇప్పుడు మాట ఎందుకు తప్పారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.