వైయస్సార్ వేరు – జగన్ వేరు. * పరిశ్రమలను నాశనం చేశారు – డాక్టర్ పెమ్మసాని. ‘గత ఎన్నికల్లో వైయస్సార్ ను చూసి అందరూ జగన్ కు ఓటు వేశారు. కానీ వైయస్సార్ వేరు, జగన్ వేరు అని ప్రజలకు ఇప్పుడు అర్థమైంది.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ఆయన మంగళవారం చేపట్టిన సుడిగాలి పర్యటనలో భాగంగా 19 గ్రామాలలో రోడ్ షో నిర్వహించారు. పొన్నూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి బ్రాహ్మణ కోడూరు మొదలు కసుకర్రు వరకు ఆయన పర్యటించారు. దారి పొడవునా మహిళలు, వృద్ధులు, చిన్నారులు, డాక్టర్ పెమ్మసానిని, నరేంద్రను చూసేందుకు, కలిసి మాట్లాడేందుకు పోటీపడ్డారు. పెమ్మసానితో కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. ఆయన తన పర్యటన ఆసాంతం ప్రజా, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. రోడ్ షో లో భాగంగా పలు గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పర్యటనలో భాగంగా కొండమూది, వడ్డిముక్కల గ్రామాల్లో టీడీపీ, జనసేన జెండాలను పెమ్మసాని, ధూళిపాళ్ల కలిసి ఆవిష్కరించారు. అలాగే కొండమూది, మాచవరం, సీతారామపురం తదితర గ్రామాల్లో అంబేద్కర్, ఎన్టీయార్ విగ్రహాలకు పెమ్మసాని, నరేంద్ర విడివిడిగా పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పర్యటనలో బిజెపి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ పాతూరి నాగభూషణం, టిడిపి సీనియర్ నాయకులు దుగ్గిరాల సీతారామయ్య, జనసేన పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త వడ్డాణం మార్కండేయులుతో పాటు టీడీపీ – జనసేన – బీజేపీ నాయకులు పాల్గొన్నారు.