జగన్ దెబ్బకు కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనిపించకూడదు. పెదకాకాని మండలం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. చంద్రబాబు-జగన్ పాలనలో ఉన్న వ్యత్యాసం ఒకసారి గుర్తు చేసుకోండి. చంద్రబాబు పోలవరం పనులు 72% పూర్తి చేస్తే, బిల్లులు ఇవ్వలేని జగన్ దెబ్బకు కాంట్రాక్టర్లు ఇప్పుడు పారిపోతున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకాకాని మండలంలో డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తొలుత రోడ్ షో నిర్వహించిన తక్కెళ్ళపాడు గ్రామంలో ఆయన మాట్లాడుతూ గ్రామంలో వేసిన రోడ్లన్నీ టిడిపి హయాంలో వేసినవేనని, జగన్ వచ్చాక రోడ్లు వేయాలన్న కనీస ఆలోచన కూడా వైసీపీ ప్రభుత్వం చేయలేదని పెమ్మసాని విమర్శించారు. పోలవరం పనులకు జగన్ నియమించిన కాంట్రాక్టర్లు ఎందుకు పారిపోతున్నారో చెప్పగల ధైర్యం ఉందా అని ఈ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. టిడిపి హయాంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రానికి 11 లక్షల ఇల్లు అమలయ్యేలా చూసిన ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనని ఆయన గర్వంగా చెప్పారు. గడిచిన ఐదేళ్లలో జలజీవన్ మిషన్ కింద రాష్ట్రాన్ని కేటాయించిన నిధుల్లో కేవలం కడప జిల్లాకు మాత్రమే 100% ఉపయోగించారని, గుంటూరు జిల్లాకు 30 శాతం కంటే తక్కువ నిధులు ఉపయోగించడం వల్ల ఫలితం లేకుండా పోయిందని పెమ్మసాని వివరించారు. ఇలాంటి నాయకుడు, పార్టీని రాబోయే ఎన్నికల్లో దరిదాపుల్లో కనిపించకుండా ప్రజలు ఓటింగ్ చేయాలని పెమ్మసాని విజ్ఞప్తి చేశారు. అనంతరం పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ళ నరేంద్ర మాట్లాడుతూ ప్రజలకు మేలు జరగాలన్న రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్న టిడిపి-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం రావాలని తెలిపారు. ప్రజలంతా పరిస్థితులను గమనిస్తూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. వెంకట కృష్ణాపురం పర్యటనలో పెమ్మసాని పనికిమాలిన మద్యం బ్రాండ్లు తయారు చేయడానికి జగన్ కు టైం ఉంది కానీ, ప్రజలకు మంచినీళ్లు ఇవ్వటానికి ఆతనకు టైం లేదు. గ్రామాల్లో నివసించే సామాన్యులకు తెలిసిన నీటి సమస్య ఒక సీఎం అయ్యుండి జగన్ కు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఇంట్లో నుంచి కనీసం బయటకు రాని ఈ సీఎంకు ప్రజా సమస్యలు ఎలా పడతాయి? ఈ క్రోధి నామ సంవత్సరంలో ప్రజలు తమ క్రోధాన్ని జగన్ ప్రభుత్వంపై చూపాలి. ఇతర దేశాల్లో తెలుగువారి ఖ్యాతిని ఇనబడింపజేసిన వారిలో నేనూ ఒకరిని, రానున్న రోజుల్లో గుంటూరు ఖ్యాతిని రాష్ట్ర సరిహద్దులు దాటేవరకు తెలిపేలా పనిచేస్తాను.’ అని పెమ్మసాని ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే ధూళిపాళ్ల మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో 10-12 అడుగుల పైపులు కలపడం కూడా చేతకాని నాయకులు నియోజకవర్గంలో ఉన్నారని, రు. 2.70 కోట్ల నిధులతో తమ ప్రభుత్వంలో ప్రారంభించిన పనులను తామే పూర్తి చేసి నీళ్లు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ జర్నసేన సమన్వయకర్త వడ్రాణ మార్కండేయులు, పెదకాకాని మండల జనసేన అధ్యక్షుడు వెంకట్రావు తదితర టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.