ప్రోత్సాహకాలు లేక పరిశ్రమలు కుదేలు. * కార్మికులతో డాక్టర్ పెమ్మసాని. నాయకుడిని బట్టి ప్రజలు, పరిశ్రమలను బట్టి కార్మికుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒక కార్మికుడి కష్టం ఒక వ్యవస్థను నిలబెడుతుంది.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలోని కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ పరిశ్రమను ఆయన గురువారం పరిశీలించారు. అక్కడి కార్మికులతో మమేకమై కాసేపు మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడి పని చేసే వారికే ఆ కష్టం విలువ తెలుస్తుందని, కార్మికులు గాని కార్యకర్తలు గాని బాగున్నప్పుడే వ్యవస్థలు సజావుగా నడుస్తాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు ప్రోత్సాహకాలు లేక కుదేలవుతున్నాయని, మరికొన్ని పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నాయని ఆయన వివరించారు. తర్వాత సంస్థ అధినేత కొత్తా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 50 ఏళ్ల చరిత్రలో ప్రస్తుత పరిస్థితి లాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదురు కాలేదని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆలోచించి తమ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అందరినీ కోరారు.