అవమానాల నుంచి పుట్టిన గళమే జాషువా. ఎన్నో అవమానాలను, అవహేళనలను దిగమింగుకొని జాషువా తన గళాన్ని కవితల రూపంలో ప్రపంచానికి చాటి చెప్పారని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా గుంటూరులోని స్థానిక ఆనందపురంలో గల క్రైస్తవ సమాధులలోని ప్రముఖ కవి, కీర్తిశేషులు గుర్రం జాషువా సమాధి వద్దకు వెళ్లిన డాక్టర్ పెమ్మసాని పూలమాలలు వేసి జాషువాకు శుక్రవారం నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో నేటికీ కొందరు దళితులు అవమానాల పాలవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మీదే అందరూ ఆధారపడకుండా ప్రతి ఒక్కరు తమ సొంత కాళ్లపై నిలబడ్డరోజే సామాజికంగా ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోగలరని, తద్వారా నలుగురిని శాసించే స్థాయికి చేరుకోగలరని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పెమ్మసాని తోపాటు పత్తికొండ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మ్యాని, పలువురు క్రైస్తవ సోదరులు కూడా పాల్గొన్నారు.