నరకయాతనలో నగర జనం. + అర్థ దశాబ్దంగా దర్శనమిస్తున్న అసంపూర్ణ వంతెనలు. + ట్రాఫిక్ ఇక్కట్లు తీర్చలేని అస్తవ్యస్త ప్రభుత్వం. + గుంటూరులో అసంపూర్ణంగా ఆగిన వంతెనల పరిశీలనలో పెమ్మసాని ‘పెరుగుతున్న నగర జనాభాకు తగ్గ రహదారులు లేవు. ప్రజా జీవనానికి తగ్గ సౌకర్యాలు లేవు. ట్రాఫిక్ సమస్యలు తీర్చే నాధులు లేరు. పురాతన, నూతన వంతెనల స్థితిగతులు పట్టించుకునే నాయకులు లేరు. అస్తవ్యస్తంగా మారిన నగర జీవనంలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఒక భాగమైపోయాయి. ఈ పరిస్థితులు మారాలని, టిడిపి ప్రభుత్వం రాగానే నవనిర్మాణాలకు శ్రీకారం చుడతామని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. * నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై పెమ్మసాని గుంటూరులో పలు రహదారులను, అసంపూర్ణంగా ఆగిన వంతెనల నిర్మాణాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ, గుంటూరు కార్పొరేషన్ సమిష్టి సమన్వయంతో ఏనాడో పూర్తి కావాల్సిన వంతెనలను నేటికీ పట్టించుకోక గాలికి వదిలేసిన ప్రస్తుత ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. * కార్యక్రమంలో భాగంగా 1. శ్యామల నగర్(R.U.B) 2. గుంటూరు-నందివెలుగు రోడ్డు (R.O.B) 3. శంకర్ విలాస్ వద్దగల 75 ఏళ్ల పురాతన వంతెన (R.O.B) తదితర ప్రాంతాల్లోని పురాతన, అసంపూర్ణంగా ఆగిన వంతెనలను ఆయన పరిశీలించారు. కాగా సంబంధిత పలువురు అధికారులతో మాట్లాడి ఆయా రైల్వే గేటుల పైగుండా నిర్మాణ ప్రతిపాదనలు జరిగి, ప్రక్రియ ముందుకు సాగని పలు వంతెనల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణాలకు జరిగిన నిర్ణయాలు, నిధుల కేటాయింపులు, దారి మళ్లించిన అధికారుల, నాయకుల ఆగడాలు తదితర అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అసంపూర్తిగా ఆగిన నిర్మాణాలతోపాటు 75 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనల పరిస్థితి కూడా దారుణంగా ఉన్నాయని ఈ సందర్భంగా పెమ్మసాని వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా, జగన్ ప్రభుత్వం సహకారం అందించకపోవడంతో ప్రయత్నాలన్నీ ఎక్కడి గొంగళి అక్కడే అన్న తీరున ఆగిపోయాయని ఆయన విమర్శించారు. నిర్మాణాలకు అవసరమైన నిధులన్నీ జగన్ ప్రభుత్వంలో పక్కదారి పట్టాయని, టిడిపి అధికారంలోకి రాగానే ఆగిన నిర్మాణాలకు పరిష్కారం చూపిస్తామని ఆయన వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్వరితగతిన వంతెనల నిర్మాణాలు కార్యరూపం దాల్చేలా పాటుపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోతురాజు సమత, ఈరంటి హరిబాబు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories