ఆర్థిక అసమానతలు రూపుమాపాలి. + తెనాలి, ఏకలవ్య నగర్ లో ప్రజలతో మాట్లాడిన పెమ్మసాని. ‘ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్తాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. తెనాలి నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక మూడో వార్డులో గల ఏకలవ్య నగర్ లో స్థానికులతో ఆత్మీయ సమావేశ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ సంక్షేమం పేరిట రూ. 5-10 వేలు ఇచ్చినంత మాత్రాన ప్రజల జీవన విధానం మారదు అని చెప్పారు. ఒక వ్యక్తి అర్హతలను బట్టి స్వయంగా సంపాదించుకొనే అవకాశాలు కల్పించినప్పుడే ఒక కుటుంబం గానీ సమాజంగానే అభివృద్ధి బాటలో నడుస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన కారణంగా ఉద్యోగాలు లేక యువత ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలస పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు. నాయకులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని జగన్ పాలనలో మూడో కృష్ణుడు వెనుక నుంచి ‘ఎస్’ అంటేనే పనులు జరిగే దుస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. అలాగే తెనాలి నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ప్రజల జీవనోపాధికి సంబంధించి ప్రజాస్వామ్యం హక్కు కల్పించిందని, ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వంలో చేతివృత్తులు, వృత్తిపై ఆధారపడి బతికే వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారని ప్రజల జీవనోపాధికి ఉపయోగపడేలా రాబోయే రోజుల్లో ప్రణాళికలు రచిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు లీలా శంకర్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు గోపీచంద్, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు