నాకు ఎదురైన ప్రశ్నలకు నేనే సమాధానం. * యూత్ ఎంపవర్మెంట్ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని ‘ఎవరు ఎన్ని చెప్పినా ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక స్పష్టత, ధైర్యం ఉండాలి. రాజకీయాల్లోకి వస్తున్నాను అనగానే నాకు ఎదురైన ఎన్నో ప్రశ్నలకు నేనే సమాధానంగా నిలిచాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. నగరంలోని అమరావతి రోడ్డులో గల ఏ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన యూత్ ఎంపవర్మెంట్ ఎక్స్చేంజ్ – 2024 కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కేవలం కలలు కనడం ఒకటే విజయానికి మార్గం కాదని కార్యాచరణ, పక్కా ప్రణాళిక ముఖ్యమని చెప్పారు. తాను ఈరోజుకీ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడతానని, తనకు ఉన్న డెడికేషన్ కు తానే ఒక ఉదాహరణ అని ఈ సందర్భంగా తెలియజేశారు. యువత సినిమా, క్రికెట్, సోషల్ మీడియా అంటూ సమయం వృథా చేయకుండా లక్ష్యాన్ని చేరువ అయ్యేందుకు ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. ఒక సినిమా చూసే సమయంలో ఒక మంచి పుస్తకం చదివి కానీ, ఒక స్ఫూర్తిదాయకమైన ఇంటర్వ్యూలు చూసి ప్రేరణ పొందడం వల్ల కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టవచ్చు అని తెలిపారు.  కార్యక్రమం అనంతరం వారి వారి రంగాల్లో నిపుణులైన పలువురికి ముఖ్యఅతిథిగా పెమ్మసాని ప్రోత్సాహకాలు అందజేసి సత్కరించారు.