డా. చంద్రశేఖర్ పెమ్మసాని
మధ్యతరగతి కుటుంబానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ విద్యాభ్యాసం నేటి తరానికి ఆదర్శం. కార్పొరేట్ సంస్థలు కదంతొక్కుతున్న రోజుల్లో, సాధారణ నరసరావు పేట మున్సిపల్ స్కూల్లో పదవ తరగతి చదువుకున్నారు. ప్రతిభే కొలమానంగా పోటీపడి, గుంటూరులో ఇంటర్మీడియట్‌ను పూర్తి చేసారు. 1993-94 ఎంసెట్ పరీక్షలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి 60 వేల మంది విద్యార్థులు హాజరు కాగా, రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంక్ సాధించి మెడిసిన్‌లో ఫ్రీ సీటు అందుకున్నారు. ఎదురులేని తన ప్రతిభా ప్రయాణంలో, ఉస్మానియా మెడికల్ కళాశాలలో చేరి ఎంబిబిఎస్ పూర్తి చేశారు.
పెన్సిల్వేనియా, డాన్‌విల్లే, గీసింగర్ మెడికల్ సెంటర్‌లో ‘ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ’ విద్యని హై పర్సంటైల్‌తో పూర్తి చేసారు. అనేక బోర్డు పరీక్షల్లో అత్యధిక పర్సంటైల్ స్కోర్‌లను సాధించి మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణ సమయంలోనే, 2 సంవత్సరాలు జాతీయ వైద్య విజ్ఞాన పోటీలో, పెన్సిల్వేనియా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం - సినాయ్ హాస్పిటల్‌లో, 5 సంవత్సరాలు అటెండింగ్ వైద్యునిగా, నివాసితులకు మరియు వైద్య విద్యార్థులకు బోధకుడిగా వ్యవహరించారు.
వ్యవస్థాపకునిగా ప్రయాణం
రైతు కుటుంబంలో జన్మించి, స్వశక్తితో ఎదిగి, అమెరికాలో ఉన్నత వైద్యుడిగా, అనితరసాధ్య ప్రతిభాశాలిగా ఎదిగారు చంద్రశేఖర్. తాను నేర్చుకున్న విద్యనే పదుగురికి పంచి “EY Entrepreneur of the year” గా కీర్తి సాధించారు. అకుంఠిత దీక్షతో అసాధారణ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేసి, గుంటూరు ప్రజలు గర్వపడే స్థాయికి చేరుకున్నారు.
తాతలది వ్యవసాయం కాగా, తండ్రి పెమ్మసాని సాంబశివరావు వ్యాపార రీత్యా బుర్రిపాలెం గ్రామం నుండి వెళ్లి నరసరావు పేట పట్టణంలో స్థిరపడ్డారు. నరసరావు పేట వాసులకు ఆయన రాజకీయంగా సుపరిచితుడే. తెలుగుదేశం స్థాపించిన నాటి నుండి డాక్టర్ కోడెల శివప్రసాద్ అనుచరుడిగా ఉంటూ రెండు దశాబ్దాల పాటు పార్టీకి విశిష్ట సేవలందించారు.
అమెరికాలో వైద్యులుగా పనిచేసేందుకు USMLE పరీక్ష రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షలోనూ హై పర్సంటైల్‌తో ఉత్తీర్ణులయ్యారు చంద్రశేఖర్. అయితే అందుకు 4 వేల డాలర్లు ఖర్చయ్యాయి. చాలామంది ఆశావహుల ఆర్థిక పరిస్థిని అర్థం చేసుకున్న చంద్రశేఖర్, తాను నేర్చుకున్న విద్య నుండి భావితరాల కోసం సరళమైన, చవకైన స్టడీ మెటీరియల్‌ను రూపొందించారు. అమెరికా వైద్య విద్యా రంగంలో అదో సంచలనం. ఈ స్టడీ మెటీరియల్‌తోనే “యు వరల్డ్” సంస్థని సృష్టించి, చాలామంది వైద్య విద్యార్థులకు అండగా నిలిచారు.
“UWorld” స్టడీ మెటీరియల్ చదివినవారు సైతం హై పర్సంటైల్‌తో ఉత్తీర్ణులై, జీవితంలో అత్యున్నత స్థాయిలో స్థిరపడడం విశేషం. అందుకే ప్రపంచంలోని అత్యంత పరివర్తన కలిగిన విద్యా సంస్థల జాబితాలో “UWorld” నిలిచింది.